తమకే ఓట్లు వేయమంటూ ప్రచారం
ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ విమర్శలు
ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకోని వారు ఆరు శాతం
వారిని ఆకర్షించడమే అందరి లక్ష్యం
ఫలితాలను ప్రభావితం చేసేదీ ఆ ఆరు శాతమే!
అమెరికా నుంచి టీఎస్ సుధీర్:

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇంటర్నెట్ హవా నడుస్తోంది. ముఖ్యంగా ట్విట్టర్, ఫేస్‌బుక్‌లాంటి సోషల్ మీడియాను గతంలో ఎన్నడూ లేనంతగా ఉపయోగించుకుంటున్నారు. 2008లో జరిగిన ఎన్నికల్లోనూ ఒబామాను వైట్‌హౌస్‌కు పంపించడంలో సోషల్ మీడియా పాత్ర ఉందని మీరనవచ్చు. కానీ ఈసారి దాని ప్రభావం మరింత ఉధృతంగా ఉంది. తన భర్త బరాక్ ఒబామాకు ఓటేయాలని నేరుగా కోరుతూ గతవారం అమెరికా ప్రథమ మహిళ మిషెల్లి ఒబామా ట్విట్టర్‌లో కోరారు. అంతేకాదు ‘మీ ట్విట్టర్ ద్వారా మరింత ఎక్కువమంది ఓట్లేసేలా చేయండి. ‘ఒబామా 2012’ను ఫాలోకండి/రీట్వీట్ చేయండి’ అని తమ ట్విట్టర్ టీమ్ లింక్ కూడా ఇచ్చారు.
ఇంటర్నెట్ వార్!
ట్విట్టర్, ఫేస్‌బుక్‌లాంటి సోషల్ మీడియాలో ఒబామా టీమ్ దూసుకుపోతోంది. ట్విట్టర్‌లో ఒబామాకు 2,13,46,142 మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఆయన ప్రతిరోజూ తన ట్వీట్స్‌ద్వారా వారితో సంభాషిస్తూనే ఉన్నారు. ‘థాంక్యూ... గత రెండు రోజుల ప్రచారంతోనవంబర్ 6న జరగబోయే ఎన్నికలకు ఒహాయో, ఇల్లినాయీ, వర్జీనియా, ఫ్లోరిడా, కాలిఫోర్నియా, నెవాడా, కొలరాడో, అయోవా రాష్ట్రాలు సిద్ధంగానే ఉన్నాయనిపించింది. మీరు నాతోనే ఉన్నారా?’’ అని ఒబామా ఈరోజు ట్వీట్ చేశారు. ఫేస్‌బుక్‌లో ఒబామా పేజీని 3,14,17,401మంది ఇష్టపడ్డారు. 31,57,299మంది దాని గురించి మాట్లాడుకుంటున్నారు. రిపబ్లికన్ అభ్యర్థి మిట్ రోమ్నీ ఈ విషయంలో కాసింత వెనుకబడి ఉన్నాడని చెప్పవచ్చు.
ఫేస్‌బుక్‌లో ఆయన పేజీని 1,08,88,738మంది మాత్రమే ఇష్టపడ్డారు. అయితే 34,23,792మంది దాని గురించి మాట్లాడుకోవడం రోమ్నీ టీమ్‌కు ఊరట కలిగించే విషయం. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇరువర్గాలూ ఇంటర్నెట్‌ను ఎలా ఉపయోగించుకుంటున్నాయో ఈ సంఖ్యలే చెబుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటివరకూ ఎవరికి ఓటేయాలనే విషయమై నిర్ణయం తీసుకోనివారిని నవంబర్ 6నాటికి తమవైపునకు ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. అంతేకాదు ఇంటర్నెట్ సాక్షిగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఒబామాకు మరో చాన్స్ ఇవ్వద్దంటూ రోమ్నీ పేజీలోనూ, మహిళలపట్ల రోమ్నీ టీమ్ వ్యాఖ్యలను ఉదహరిస్తూ ఒబామా పేజీలోనూ పోస్టింగ్స్ కనిపిస్తున్నాయి. అధ్యక్ష అభ్యర్థుల మధ్య తొలి చర్చకు సంబంధించి 10 మిలియన్ల ట్వీట్స్ రావడం అమెరికా రాజకీయ చరిత్రలో ఒక రికార్డని ట్విట్టర్ ప్రకటించింది.
ఆ ఆరుశాతమే కీలకం!: అయితే చాలామంది ఓటర్లు ఇప్పటికే ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకున్నందున ఇంటర్నెట్ పెద్దగా ప్రభావం చూపదని జాన్ నాటన్ ‘గార్డియన్’లో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. అయితే ఇప్పటికీ నిర్ణయించుకోని ఆరుశాతం మంది ఎవరికి ఓటేస్తారో మరో వారం రోజుల్లో తెలుస్తుందన్నారు. ‘‘ఇప్పటికీ నిర్ణయం తీసుకోనివారికి రాజకీయాలపట్ల అంతగా ఆసక్తి చూపనివారే. 164మిలియన్ల అమెరికన్ ఫేస్‌బుక్ వినియోగదారుల్లో వారూ ఉన్నారు. వారే నిజమైన అధ్యక్షుడిని నిర్ణయిస్తారని డేవిడ్ టాల్బోట్ అనే వ్యాఖ్యాత చెప్పారు’’ అని గార్డియన్ పేర్కొంది. రాజకీయాలపట్ల ఆసక్తి లేని ఫేస్‌బుక్ యూజర్లు రాజకీయ మెసేజ్‌లను తిప్పికొట్టినా, తమ ఫేస్‌బుక్ కాంటాక్ట్స్‌నుంచి వచ్చిన మెసేజ్‌లపట్ల ఉదారంగా ఉంటారు. డోలాయమానంలోఉన్న ఫ్లోరిడా, ఒహియో రాష్ట్రాలకు చెందిన ఓటర్లు రోమ్నీని ‘పెట్టుబడిదారీ రాబందు’గా అభివర్ణించిన పేజీని లైక్ చేసినా... రోమ్నీ పెట్టుబడిపెట్టిన స్టేపుల్స్ నుంచే తాము స్టేషనరీ కొంటున్నామని గుర్తుచేస్తూ ఫ్రెండ్స్‌నుంచి మెసేజ్‌లు అందుకోవచ్చు. అది వారి నిర్ణయాన్ని మార్చనూవచ్చు’’ అని ఆ వ్యాసంలో పేర్కొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి