తెలుగుదేశం పార్టీ సీనియర్‌నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు కింజారపు ఎర్రన్నాయుడు ఇక లేరు. గురువారం అర్థరాత్రి రెండు గంటల సమయంలో శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం దండానపేట కూడలి వద్ద ఎర్రన్నాయుడు ప్రయాణిస్తున్న కారు పెట్రోల్‌ ట్యాంకర్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎర్రన్నాయుడితో పాటు టిడిపి జిల్లా అధ్యక్షుడు చౌదరి బాబ్జి, అధికార ప్రతినిధి కలిశెట్టి అప్పలనాయుడు, డ్రైవర్‌కు తీవ్ర గాయలయ్యాయి. వెంటనే వారిని శ్రీకాకుళం కిమ్స్‌ సాయిశేషాద్రి ఆస్పత్రికి తరలించారు.

ఎర్రన్నాయుడు అరగంట పాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచారు. ఆయన ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు ఎంత శ్రమించినా ఫలితం లేకపోయింది. వెన్నుపూస, గుండె భాగాల్లో ఎర్రన్నాయుడుకు తీవ్ర గాయలు అయ్యాయి.

చివరకు మూడున్నర గంటల ప్రాంతంలో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఎర్రన్నాయుడు విశాఖలోని ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఎర్రన్నాయుడు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో శనివారం ఉదయం ఆయన స్వగ్రామంలో జరుగుతాయి. 

కార్యకర్తలు,అభిమానులు ఎర్రన్న అని ఆప్యాయంగా పిలుచుకునే ఎర్రన్నాయుడు 2004 సంవత్సరంలో మావోయిస్టుల దాడిలో మృత్యుఒడి వరకూ వెళ్లి చివరకు ప్రాణాలుతో బయటపడ్డారు. పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయనపై శ్రీకాకుళం రూరల్‌ మండలం బైరిసింగిపురం వద్ద మావోలు పేల్చిన ల్యాండ్‌మైన్‌ లో తీవ్రంగా గాయపడి తృటిలో తప్పించుకున్నారు. అయితే వెన్నుపూస దెబ్బతినడంతో ఒక సంవత్సరంపాటు ఆయన మంచానికే పరిమితమయ్యారు.

ఎర్రన్నాయుడు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో 1957, ఫిబ్రవరి 23న వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. గార గ్రామంలో ఉన్నతవిద్య, టెక్కలీ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ విద్య అభ్యసించారు. విశాఖ వీఎస్ కృష్ణా కళాశాలలో బీఎస్సీ చదివారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ చేశారు. 1982, మే 28న విజయకుమారిని వివాహమాడారు. ఆయనకు కుమార్తె, కుమారుడు ఉన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి