
మంత్రిపదవుల పంపకాన్ని చేపట్టి రాష్ట్రంలో చేజారుతున్న పట్టును బిగించాలని చూసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు కావూరి సాంబశివరావు రూపంలో కొత్త చిక్కు వచ్చిపడింది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా, మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న కావూరిని కేంద్ర మంత్రివర్గ విస్తరణలో పరిగణనలోకి తీసుకోకపోవడం ఆయనకు తీవ్ర అసంతృప్తిని కలిగించింది. తాజా మంత్రివర్గ విస్తరణలో తనకంటే తక్కువ అనుభవం ఉన్న.. ఇతర పార్టీలోంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన జంప్ జిలానీలకు పదవులు పంచడాన్ని కావూరి జీర్ణించుకోలేక పోయారు. తాజా మంత్రివర్గ విస్తరణలో పదవి దక్కదనే విషయం బోధపడిన తర్వాత ... కావూరి ఆగ్రహంతో అందుబాటులో ఉన్న రాజీనామా అస్త్రాన్ని అధిష్టానంపైకి విసిరారు. దాంతో కేంద్రంలోని బడా నాయకులు.. రాష్ట్రంలోని ముఖ్య నేతతోపాటు పలువురు నేతలు కావూరి బుజ్జగించేందుకు ప్రయత్నించారు.
అయితే తన సామాజిక వర్గానికే చెందిన పురందేశ్వరికి మంత్రి పదవిలో కొనసాగుతుండటంతో పార్టీలో ఇక ఉండాల్సిన ఆవశ్యకత ఏంటని కాంగ్రెస్ అధిష్టానికి ఘాటైన లేఖ రాశారు. పార్టీ నేతల బుజ్జగింపుతో కొంత శాంతించారు. కావూరి అసంతృప్తితో ఉన్నారనే కారణంతో ఆదివారం జరిగిన మార్పుల్లో కేవలం పురందేశ్వరి శాఖ మాత్రమే మార్చారు. మానవ వనరుల శాఖ సహా మంత్రిగా ఉన్న ఆమెను... వాణిజ్య శాఖకు బతిలీ చేశారు. ఇది జరిగి రెండు రోజులు కాకుండానే పదోన్నతిపై జౌళి శాఖకు మార్చారు. కొంత కాలంగా... కేంద్రంలో జౌళి శాఖ సహాయ మంత్రిగా రాష్ట్రానికి చెందిన పనబాక లక్ష్మి వ్యవహరించారు. మంత్రి వర్గ విస్తరణ జరిగిన కొద్ది రోజుల తర్వాత రాష్ట్రంలోని పరిస్థితులు చక్కబడ్డాయని భావించిందో ఏమో.. పురందేశ్వరికి స్వతంత్ర హోదాతో జౌళి శాఖను ఆమెకు కేటాయించారు.
అయితే అధిష్టానం నుంచి ఎలాంటి భరోసా రాకపోవడం, పురంధేశ్వరికి ప్రమోషన్ ఇవ్వడంతో తాజాగా పార్టీ పదవులన్నీ వీడాలని నిర్ణయించారు. ఈ మేరకు తన రాజీనామాను ఆమోదించాలని కోరుతూ ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. పీసీసీ సమన్వయ కమిటీ సభ్యత్వానికి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ తాను పంపిన లేఖకు కట్టుబడి ఉన్నానని కావూరి స్పష్టం చేశారు. స్వతంత్ర హోదాతో పురందేశ్వరికి మంత్రి పదవి ఇస్తున్నట్టు కేంద్రం ప్రకటించిన కొద్దిసేపటికే కావూరి ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. లోకసభ సభ్యత్వానికి రాజీనామా పత్రాన్ని కొద్ది రోజులు ఆగిన తర్వాత స్పీకర్ కు అందించాలని కావూరి భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. దేశరాజధాని ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరుగనున్న కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ముందు రాజీనామా చేసి పార్టీని ఇబ్బందులోకి నెట్టడం ఇష్టం లేకనే కొద్ది రోజులు వేచి చూస్తున్నట్టు తెలుస్తోంది.
మూడు దశాబ్దాల రాజీకీయ జీవితంలో కావూరి సాంబశివరావు ఎన్నడూ అధిష్టానంపై ఇంతటి దూకుడును ప్రదర్శించలేదు. అధిష్టానానికి విధేయుడుగా ఉంటూ వచ్చిన కావూరి తెగింపును చూసి పార్టీ నేతలు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఏది ఏమైనప్పటికి పదవుల పంపకాన్ని చేసి రాష్ట్రంలోని ప్రతికూల పరిస్థితులను చక్కబెడదామనుకున్న సోనియాకు కావూరి ఇచ్చిన షాక్ గట్టిగానే తగిలినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సీమాంధ్రలో పార్టీ భ్రష్టుపట్టిందని కాంగ్రెస్ పార్టీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో రెండు సార్లు మచిలీ పట్నం నుంచి.. మూడు సార్లు ఏలూరు నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికవుతూ వస్తున్న కావూరి రాజీనామా రాష్ట్ర కాంగ్రెస్ తోపాటు, జాతీయ స్థాయిలోనూ కలవరం పుట్టిస్తోంది. అయితే గతంలో చేసిన తప్పుల్నే పునరావృతం చేసి.. కోరి కష్టాల్ని తెచ్చుకుంటుందో.. లేక కావూరి మచ్చిక చేసుకుని దారికి తెచ్చుకుంటుందో కొద్ది రోజులాగితే స్పష్టత లభించవచ్చు. ఇప్పటికే రాష్ట్రంలో కోలుకోలేని దెబ్బలతో సతమతవుతున్న కాంగ్రెస్ .. కావూరి వ్యవహారాన్ని ఏవిధంగా చక్కబెడుతుందో వేచి చూడాల్సిందే.
scrift work nice sir
రిప్లయితొలగించండిhi its very good
రిప్లయితొలగించండి