యంగ్ ఇండియన్ డీజెనరేషన్?


‘జెనరేషన్ నుంచి జెనరేషన్‌కి మనం డీ జెనరేట్ అవుతున్నా’మని ఓ మహానుభావుడు బాధపడ్డాడు. అది నిజమేనని యంగ్ ఇండియన్ సంస్థపై సుబ్రమణియన్ స్వామి చేసిన ఆరోపణలు చూస్తే అనిపిస్తుంది.

‘జెనరేషన్ నుంచి జెనరేషన్‌కి మనం డీ జెనరేట్ అవుతున్నా’మని ఓ మహానుభావుడు బాధపడ్డాడు. అది నిజమేనని యంగ్ ఇండియన్ సంస్థపై సుబ్రమణియన్ స్వామి చేసిన ఆరోపణలు చూస్తే అనిపిస్తుంది. కాంగ్రెస్ అధిష్టానమ్మ సోనియా గాంధీ, ఆమె పుత్రరత్నం రాహుల్ గాంధీ ఉమ్మడిగా ‘యంగ్ ఇండియన్’ అనే కంపెనీని ఏర్పాటు చేసి, నేషనల్ హెరాల్డ్ పత్రికకు ఉత్తర ప్రదేశ్‌లోనూ, న్యూ ఢిల్లీలోనూ ఉన్న ఆస్తులు దిగమింగాలని ప్రయత్నిస్తున్నట్లు జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణియన్ స్వామి ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలు నిరాధారమే కాక, దురుద్దేశపూరితమయినవీ, అప్రతిష్టాకరమయినవి కూడానని రాహుల్ గాంధీ కార్యాలయం ఖండించిందనుకోండి. అంతేకాదు- స్వామి ఆరోపణలపై చట్టబద్ధంగా ఏం చర్యలు తీసుకోగలమో పరిశీలిస్తున్నట్లు కూడా రాహుల్ కార్యాలయం హెచ్చరించింది.

1938లో ప్రథమ భారత ప్రధాని జవాహర్‌లాల్ నెహ్రూ స్థాపించిన పత్రిక ‘ద నేషనల్ హెరాల్డ్’. ‘స్వేచ్ఛ ప్రమాదంలో పడింది- సర్వశక్తులూ ఒడ్డి దాన్ని కాపాడుకో!’ అనే సందేశం ఈ పత్రిక శీర్షక స్థానంలో ఉంటుంది. నెహ్రూ యుగం సాగినన్నాళ్లూ హెరాల్డ్ అదే లక్ష్యానికి అంకితమయి పనిచేసిందంటారు. కోటంరాజు రామారావు, మనికొండ చలపతిరావు ఈ పత్రికకు సంపాదకులుగా పనిచేశారు. చలపతిరావు గారయితే 32 సంవత్సరాలపాటు ఈ పదవిలో కొనసాగారు. ఫెరోజ్ గాంధీ హెరాల్డ్‌కు నాలుగేళ్లపాటు మేనేజింగ్ డెరైక్టర్‌గా కూడా పనిచేశారు. న్యూ ఢిల్లీలోని బహదూర్ షా జఫర్ మార్గంలో ఉండే హెరాల్డ్ హౌస్ నుంచి ఈ పత్రిక చిరకాలం -ఏడు దశాబ్దాలపాటు- వెలువడింది. హిందీలో ‘నవజీవన్’, ఉర్దూలో ‘ఖ్వామీ ఆవాజ్’ (జనస్వరం) అనే పత్రికలను కూడా హెరాల్డ్ పత్రికతో పాటు వెలువరించేవారు.

కాంగ్రెస్ పార్టీ భవితవ్యంతో -ముఖ్యంగా నెహ్రూ కుటుంబ సభ్యుల భవితవ్యంతో- హెరాల్డ్ భోగభాగ్యాలు ప్రత్యక్షంగా ముడిపడి ఉండేవి. 1975లో ఇందిరా గాంధీ ఎమర్జెనీ్స ప్రకటించడం, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆమె ఓడిపోవడం, 1984లో ఆమె కన్నుమూయడం లాంటి పరిణామాలు హెరాల్డ్ అదృష్టాన్ని ప్రభావితం చేస్తూ పోయాయి. 1998లో -అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత- హెరాల్డ్ పత్రికకు లక్నోలో ఉన్న ఆస్తులన్నింటినీ వేలంవేసి అప్పులు తీర్చవలసివచ్చింది. అక్కడితో, హెరాల్డ్ లక్నో ఎడిషన్ మూతపడింది. అయితే, న్యూ ఢిల్లీలోని హెరాల్డ్ హౌస్ విలువ 1600 కోట్ల రూపాయల వరకూ ఉంటుందని సుబ్రమణియన్ స్వామి అంచనా కట్టారు. ఈ ఆస్తిని చేజిక్కించుకునేందుకే సోనియా-రాహుల్ యంగ్ ఇండియన్ కంపెనీని -లాభంతో నిమిత్తం లేకుండా పనిచేసే సంస్థగా ప్రకటించి- ప్రారంభించారని కూడా స్వామి ఆరోపణ.

ఒక్క హెరాల్డ్ హౌస్ అనే యేముంది? ఈ దేశమంతా నెహ్రూ కుటుంబసభ్యుల సొంత జాగీరుగా భావించే భక్తకోటి ఈ దేశంలో ఏమూలకు వెళ్లినా కనిపించవచ్చు. సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ తరంలోనే ఈ ధోరణి పాతుకుపోయింది. ఇప్పుడు సోనియా-రాహుల్-ప్రియాంక తరంలో సైతం అలా భావించే భక్తులు కొందరుండవచ్చు. అయితే, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగానూ, రాజ్యాంగ బద్ధ రాజ్యంగానూ ప్రసిద్ధమయినది భారతదేశం. ఈ దేశాన్ని ఏదో ఒక కుటుంబం ప్రైవేటు ఆస్తిగా ఎవరు పరిగణించినా అది చెల్లదు. సుబ్రమణియన్ స్వామి ఎలాంటి రాజకీయవాది అయినప్పటికీ, హెరాల్డ్ హౌస్ విషయంలో ఆయన లేవనెత్తిన ప్రశ్నలు సమంజసమయినవే. కేవలం హెరాల్డ్ హౌస్ ఆస్తిని నొక్కేయడం కోసమే సోనియా- రాహుల్ ‘యంగ్ ఇండియన్ కంపెనీ’ని సృష్టించారేమోనని అనుమానించే హక్కు స్వామికి ఉంది. ఆయనవి కేవలం అనుమానాలే అయితే, తమ ఉద్దేశాలేమిటో రుజువుచేసుకోవలసిన బాధ్యత నెహ్రూ వారసుల బుజాలపై ఉంది. ఆ పని చెయ్యకుండా స్వామిని బెదిరించడానికి తెగిస్తే, ఆ అనుమానాలు నిజాలేనేమో అని ప్రజలు సందేహించవలసి వస్తుంది. నిక్కమయిన ప్రజాస్వామిక స్ఫూర్తితో సోనియా- రాహుల్ స్పందించడం అవసరం!
  

More Headlines

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి