తేరుకుంటున్న అమెరికా పెను తుపాను శాండీ సృష్టించిన బీభత్సం నుంచి అమెరికా ఇపుడిపుడే తేరుకుంటున్నది.



ఇంకా చీకట్లోనే 40 లక్షల కుటుంబాలు
80కి చేరిన మృతుల సంఖ్య

న్యూజెర్సీ: పెను తుపాను శాండీ సృష్టించిన బీభత్సం నుంచి అమెరికా ఇపుడిపుడే తేరుకుంటున్నది. తూర్పు తీరంలోని పలు నగరాలు, పట్టణాల్లో చాలా చోట్ల ఇంకా కరెంటును పునరుద్ధరించలేదు. గురువారం నాటికి దాదాపు 40 లక్షల కుటుంబాలు ఇంకా చీకట్లో మగ్గుతున్నాయి. న్యూయార్క్ నగర రోడ్లపై బస్సు సర్వీసులు మొదలయ్యాయి. సబ్‌వే సర్వీసులు కూడా పాక్షికంగా ప్రారంభమయ్యాయి. బస్సులు, రైళ్లలో గురుశుక్రవారాలు ఉచితంగా ప్రయాణించవచ్చని న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్వోమో ప్రకటించారు. నగరంలోని బ్రిడ్జిలన్నిటినీ తెరిచారు. రెండు రోజుల తర్వాత తెరుచుకున్న న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజి జనరేటర్‌పై నడుస్తోంది. న్యూయార్క్, న్యూజెర్సీలను కలిపే హోలాండ్ టన్నెల్‌లో వరదనీరు ఇంకా అలాగే ఉంది. శాండీ విలయంలో మరణాల సంఖ్య 80కి చేరుకున్నది. అందులో 37 మంది న్యూయార్క్‌నగరవాసులున్నారు. న్యూజెర్సీలో 8 మంది, కనెక్టికట్‌లో నలుగురు మరణించారు. తుపాను ధాటికి న్యూయార్క్ రాష్ర్టంలో 600 కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లిందని గవర్నర్ ఆండ్రూ క్వోమో చెప్పారు. వరద పూర్తిగా తగ్గకపోవడం పలు చోట్ల సహాయ కార్యక్రమాలకు ఆటంకంగా మారింది.

న్యూయార్క్‌లోని జాన్‌ఎఫ్‌కెన్నడీ విమానాశ్రయం, న్యూజెర్సీలోని నెవార్క్ లిబర్టీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో రాకపోకలు ప్రారంభమయ్యాయి. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యాలయం మూడోరోజు కూడా మూతపడింది. వరదనీటి వల్ల భద్రతామండలి ఛాంబర్ దెబ్బతినడంతో ఐక్యరాజ్యసమితి రాయబారుల ప్రత్యేక సమావేశాన్ని తాత్కాలిక శిబిరంలో నిర్వహించారు. న్యూయార్క్ నగరంలో 6.43 లక్షల మంది ఇంకా చీకట్లోనే మగ్గుతున్నారని, విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు మరికొన్ని రోజులు పడుతుందని నగర మేయర్ మైఖేల్ బ్లూమ్‌బర్గ్ చెప్పారు. బ్యాక్‌అప్ జనరేటర్ పనిచేయడం ఆగిపోవడంతో మన్‌హట్టన్‌లోని ప్రముఖ ఆసుపత్రి బెల్లెవూ నుంచి 700 మంది రోగులను వేరే ఆసుపత్రులకు తరలించారు. న్యూజెర్సీలోని హోబోకెన్ పట్టణంలో వరద నీటిలో చిక్కుకు పోయిన వేలాది మందిని నేషనల్ గార్డ్ దళాలు సురక్షిత ప్రాంతాలకు చేర్చాయి. రాష్ర్ట ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో సహాయకార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రహదారులు, విద్యుత్ సరఫరా పునరుద్ధరించడానికి మరో నాలుగైదు రోజులు పట్టవచ్చని అంటున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి