ముఖ్యమంత్రి పచ్చజెండా.. ఏప్రిల్ 1నుంచి అమలు
2013-14లో విద్యుత్ చార్జీల పెంపుపై డిస్కంల ప్రతిపాదన
గృహ వినియోగదారులపై రూ. 3,606 కోట్ల భారం
టెలిస్కోపిక్ విధానం ఎత్తివేత.. రెట్టింపు కానున్న బిల్లులు
చిన్న పరిశ్రమలకు ఇక పెద్ద దెబ్బ.. రూ. 705 కోట్ల షాక్
పంచాయతీలు, మునిసిపాలిటీలనూ వదలని వైనం
స్థానిక సంస్థలపై భారం రూ. 505 కోట్లు..
వీధి దీపాలు, తాగునీటి సరఫరాకు ఇక్కట్లే
భారీ పరిశ్రమలకు భారీ స్థాయిలో వడ్డింపు
ఇప్పటికే చార్జీల మీద చార్జీలు పెంచారు.. సర్‌చార్జీల మోత మోగించారు. కూలి కష్టమంతా కరెంటు బిల్లుతో లాగేసుకుంటున్నారు. పేద, మధ్యతరగతి గుండె గుభేల్‌మనిపిస్తున్నారు. ఇది చాలదన్నట్లు మళ్లీ వీపు విద్యుత్ చార్జీల మోత మోగించారు. ఇక స్విచ్ వేయాలంటేనే భయపడే పరిస్థితి తెచ్చేశారు.
నిండా ముంచే ‘నాన్ టెలిస్కోపిక్’ఇప్పటిదాకా (టెలిస్కోపిక్ విధానంలో..)
ఒక కుటుంబం నెలకు 220 యూనిట్ల కరెంటు వినియోగిస్తే... మొదటి 100 యూనిట్లకు యూనిట్‌కు రూ.2.60. అంటే రూ.260. 101-200 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.3.60 చొప్పున రూ.360. మిగిలిన 20 యూనిట్లకు యూనిట్‌కు రూ.5.75 చొప్పున రూ.115.
అంటే 220 యూనిట్లకు మొత్తం రూ.735 బిల్లు కట్టాల్సి వచ్చేది.
ఇకపై (నాన్ టెలిస్కోపిక్...)
ఒక కుటుంబం నెలకు 220 యూనిట్లను వినియోగిస్తే... మొత్తం 220 యూనిట్లకూ యూనిట్‌కు రూ.6.15 చొప్పున వసూలు చేస్తారు.
అంటే ఇప్పటిదాకా రూ.735 కట్టేవారు ఇకపై ఏకంగా రూ.1353 చెల్లించాల్సి ఉంటుందన్నమాట!
సాక్షి, హైదరాబాద్:

విద్యుత్ వినియోగదారులపై పెనుభారం పడింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.12,723 కోట్ల విద్యుత్ చార్జీల వడ్డింపునకు ముఖ్యమంత్రి పచ్చజెండా ఊపారు. విద్యుత్ చార్జీలను పెంచడంలో తన రికార్డును తానే తిరగరాసుకున్నారు. గత ఏడాది రూ.5 వేల కోట్ల మేర విద్యుత్ చార్జీలను పెంచిన రాష్ట్ర ప్రభుత్వం... ఈసారి అంతకు రెండున్నర రెట్ల విద్యుత్ చార్జీల వడ్డనకు సిద్ధమయ్యింది. ఏ రంగాన్నీ వదలకుండా చార్జీలు పెంచనున్నారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకూ జరిగిన కసరత్తులో మంత్రులు, అధికారులకే దిమ్మతిరిగేలా భారీ వడ్డనకు సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో 2013-14కు సంబంధించిన విద్యుత్ చార్జీల ప్రతిపాదనలను నాలుగు విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) శనివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) కార్యదర్శి మనోహర్‌రాజు, డెరైక్టర్ (టారిఫ్) మనోహర్‌రెడ్డిలకు సమర్పించాయి. ఈ ప్రతిపాదనలపై ఫిబ్రవరిలో ఈఆర్‌సీ బహిరంగ విచారణ చేపట్టనుంది. తర్వాత మార్చి చివరివారంలో చార్జీల పెంపుపై ఆదేశాలు జారీ చేయనుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త విద్యుత్ చార్జీలు అమల్లోకి రానున్నాయి.

వచ్చే ఏడాదిలో రూ.49,189 కోట్ల ఆదాయం కావాల్సి ఉండగా, ప్రస్తుత చార్జీల ప్రకారం రూ.30,582 కోట్ల ఆదాయం వస్తుందని డిస్కంలు తమ ప్రతిపాదనల్లో తెలిపాయి. రూ.18,607 కోట్ల లోటు ఉంటుందని వివరించాయి. ప్రతిపాదిత చార్జీల పెంపు ద్వారా రూ.12,723 కోట్ల ఆదాయం సమకూరనుందని... వ్యవసాయ ఉచిత విద్యుత్‌కు, గృహాలకు ఇస్తున్న సబ్సిడీ విద్యుత్‌కు గానూ ప్రభుత్వం రూ.5,884 కోట్లను భరించనుందని పేర్కొన్నాయి. గత ఏడాదిలో యూనిట్ విద్యుత్ ఉత్పత్తి ఖర్చు (కాస్ట్ టు సర్వ్-సీవోఎస్) రూ.4.42 ఉండగా, వచ్చే ఏడాదిలో రూ.5.61కి పెరగనుందన్నాయి. ఈ నేపథ్యంలోనే చార్జీలను పెంచాలని ప్రతిపాదిస్తున్నామని డిస్కంలు తెలిపాయి. తాజా ప్రతిపాదనలతో సగటున యూనిట్‌కు రూ.1.20 చొప్పున విద్యుత్ చార్జీలు పెరగనున్నాయి. ప్రతిపాదిత చార్జీల పెంపు వల్ల గృహ వినియోగదారులపై రూ.3,606 కోట్ల భారం పడనుండగా, చిన్నతరహా వాణిజ్య సంస్థలపై రూ.1930 కోట్లు, చిన్నతరహా పరిశ్రమలపై రూ.607 కోట్లు, కాటేజీ, ధోబీఘాట్లు తదితరాలపై రూ.30 కోట్లు, పంచాయతీలు, మునిసిపాలిటీలపై రూ.595 కోట్లు, భారీ తరహా పరిశ్రమలపై రూ.4,728 కోట్లు, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌లపై రూ.804 కోట్లు, రైల్వే ట్రాక్షన్‌పై రూ.265 కోట్ల భారం పడనుంది.
భారీ పరిశ్రమల తర్వాత గృహ వినియోగదారులపైనే అధికంగా భారం పడనుండటం గమనార్హం. నెలకు 100 యూనిట్లలోపు వాడుకునే గృహ వినియోగదారులకు చార్జీలు పెంచలేదు. అయితే, 100 యూనిట్లకు మించిన వినియోగంపై టెలిస్కోపిక్ విధానాన్ని ఎత్తివేశారు. ఫలితంగా చార్జీల మోత మోగనుంది. ప్రస్తుతం కాంట్రాక్టు లోడు 500 కె.వి లోపు గృహ వినియోగదారులు ఒక కేటగిరీగా, 500 కె.వి దాటినవారు మరో కేటగిరీగా ఉన్నారు. తాజాగా ఈ రెండు కేటగిరీలనూ ఒకే కేటగిరీగా చేశారు. గృహ వినియోగదారులకు గరిష్టంగా యూనిట్‌కు రూ.2 వరకూ చార్జీలు పెరగనుండగా, చిన్నతరహా పరిశ్రమలకు ఏకంగా రూ.1.20 పెరిగింది. చిన్నతరహా వాణిజ్య సంస్థలు మొదలుకుని... మరమగ్గాలు, చెరకు క్రషింగ్, పౌల్ట్రీఫామ్స్, ప్రార్థనా మందిరాలతో సహా అన్ని కేటగిరీలకు విద్యుత్ చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమయ్యింది. కాగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను యథావిధిగా కొనసాగిస్తామని డిస్కంలు పేర్కొన్నాయి. కార్పొరేట్, ఐటీ చెల్లించే రైతులకు విద్యుత్ చార్జీలు పెంచలేదు.
చిన్న పరిశ్రమలకు శరాఘాతం

ప్రస్తుతం చిన్నతరహా పరిశ్రమలకు ప్రత్యేక కేటగిరీ ఉంది. తాజా ప్రతిపాదనల్లో చిన్నతరహా పరిశ్రమలకు విద్యుత్‌చార్జీలను ఏకంగా యూనిట్‌కు రూ.1.20 చొప్పున పెంచారు. ప్రస్తుతం రూ.5 ఉన్న చార్జీని కాస్తా రూ.6.20కు పెంచారు. ఇప్పటికే వారంలో మూడున్నర రోజుల పాటు కొనసాగుతున్న విద్యుత్ కోతలతో మూతపడుతున్న చిన్నతరహా పరిశ్రమలకు ఈ చార్జీలు మరింత భారం కానున్నాయి. వీటిపై ఏకంగా రూ.705 కోట్ల భారం పడనుంది. చిన్నతరహా వాణిజ్య సంస్థలకూ భారీగా విద్యుత్ చార్జీలు పెరిగాయి. లో-టెన్షన్ (ఎల్‌టీ) కేటగిరీలోని వాణిజ్య సంస్థలకు యూనిట్ చార్జీలను రూ.1.35 నుంచి రూ.1.55 వరకూ పెంచారు. అడ్వర్‌టైజింగ్ హోర్డింగ్స్ విద్యుత్ చార్జీలను రూ 9 నుంచి రూ.10.40కి పెంచారు.
భారీ పరిశ్రమలకు భారీగానే వడ్డన...

భారీ పరిశ్రమలకు యూనిట్‌కు రూ.1.40 నుంచి రూ.1.69 వరకూ పెరిగింది. వీటి ద్వారా రూ.4,728 కోట్ల అదనపు ఆదాయం రాబట్టుకోవాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అదేవిధంగా సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రస్తుతం టైమ్ ఆఫ్ డే (టీవోడీ) టారిఫ్ కింద అదనంగా రూపాయి వసూలు చేస్తున్నారు. ఈ టీవోడీ టారిఫ్‌ను కూడా యూనిట్‌కు రూ.1.01 నుంచి రూ.1.64 వరకూ పెంచారు. ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు ప్రస్తుతం ప్రత్యేక టారిఫ్ విధానం అమల్లో ఉంది. ఈ పరిశ్రమలను భారీ పరిశ్రమల కేటగిరీ కిందకు చేర్చి... అవే విద్యుత్ చార్జీలను వసూలు చేయనున్నారు. మల్టీప్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్‌కు కూడా భారీగానే చార్జీలు పెంచారు. యూనిట్‌కు గరిష్టంగా రూ.1.64 వరకూ పెరిగింది. వీటి నుంచి సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు టీవోడీ చార్జీల పేరిట ప్రస్తుతం యూనిట్‌కు అదనంగా రూపాయి వసూలు చేస్తున్నారు. ఈ చార్జీలు కూడా రూ.1.35 నుంచి రూ.1.95 వరకూ పెరిగాయి. విమానయాన సంస్థలకు కూడా చార్జీలు పెరిగాయి. వీటికి కూడా టీవోడీ విధానం అమల్లోకి తెచ్చారు. రైల్వే ట్రాక్షన్ విద్యుత్ చార్జీలను యూనిట్‌కు రూ.5.43 నుంచి రూ.6.90కు పెంచారు. టౌన్‌షిప్పులు, నివాస కాలనీలకు యూనిట్ విద్యుత్ చార్జీలు రూ. 4.50 నుంచి రూ. 6.40కు పెరిగాయి. ప్రభుత్వ ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ చార్జీలు రూ.3.25 నుంచి రూ. 5.61కు పెంచారు.
ఇక కంపెనీల మూతే: ‘ఫెర్రో అల్లాయ్’ అసోసియేషన్
ప్రతిపాదిత విద్యుత్ చార్జీల పెంపు అమలైతే రాష్ట్రంలోని 31 కంపెనీలను మూసివేయడం మినహా మరో దారి లేదని ఆంధ్రప్రదేశ్ ఫెర్రో అల్లాయ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఇప్పటికే విద్యుత్ కోతలతో కంపెనీలు అల్లాడుతున్నాయని, అధిక చార్జీలకుతోడు ఇంధన సర్దుబాటు చార్జీలు మోయలేని భారంగా పరిణమించాయని వివరించింది. ఈ సమయంలో మరోసారి చార్జీల భారం మోపడం న్యాయం కాదని అసోసియేషన్ సెక్రటరీ జనరల్ ఎం.ఆర్.ప్రసాద్ తెలిపారు. విద్యుత్ బిల్లులు కట్టలేక, కార్యకలాపాలు నిలిచిపోయి కంపెనీలు నిరర్ధక ఆస్తులుగా మిగిలి పోయే ప్రమాదమూ ఉందన్నారు. చార్జీలు పెంచుకుంటూ పోతే రాష్ట్రంలో పరిశ్రమ కనుమరుగు కావడం ఖాయమన్నారు. పరిశ్రమపై ఆధారపడ్డ వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయని పేర్కొన్నారు. ఫెర్రో అల్లాయ్ పరిశ్రమను 1975 నుంచి ప్రత్యేక విభాగంగా పరిగణిస్తున్నారని, ఇది పూర్తిగా విద్యుత్‌పైనే ఆధారపడ్డ రంగమని వివరించారు.
ధోబీఘాట్లు, మరమగ్గాలనూ వదల్లేదు
కాటేజీ పరిశ్రమలకు ఈసారి భారీగా విద్యుత్ చార్జీలను పెంచారు. వీటితో పాటు చేపలు, రొయ్యల పెంపకం, చెరకు క్రషింగ్, పౌల్ట్రీఫామ్స్, ఇతర వ్యవసాయాధార పరిశ్రమలను ఒకే గొడుకు కిందకు తెచ్చి ఎల్‌టీ-4 స్పెసిఫిక్ పర్పస్ కేటగిరీగా కొత్త కేటగిరీని తెరమీదకు తెచ్చారు. పొట్టకూటీ కోసం నడుపుకునే ధోబీఘాట్లు, మరమగ్గాలతో పాటు వ్యవసాయాధార పరిశ్రమలకు కూడా భారీగా చార్జీల షాక్ తగిలింది. ప్రస్తుతం యూనిట్‌కు రూ.2.67 ఉన్న వీటి చార్జీలు ఏకంగా రూ.4.07కు చేరాయి. ప్రార్థనా మందిరాలకూ చార్జీల బాదుడు తప్పలేదు. రూ.2.60 చార్జీ రూ.4.07కు చే రింది. ఈ పెంపు ద్వారా రూ.30 కోట్ల అదనపు ఆదాయం సమకూరనుంది.
‘ఒక్క యూనిట్’ ఖరీదు రూ.307.05!
గృహ వినియోగదారులకు కొత్త చిక్కు వచ్చి పడింది. ఇక మీదట ప్రతి యూనిట్‌ను జాగ్రత్తగా వాడుకోవాల్సిందే. ఎందుకంటే ఒక యూనిట్ వాడకం పెరిగినా బిల్లు బాంబు కానుంది. ఉదాహరణకు నెలకు 100 యూనిట్లు వాడితే ప్రస్తుతం రూ.260 మేరకు (సర్వీసు చార్జీలను మినహాయించి) బిల్లు వస్తుంది. అయితే, తాజాగా టెలిస్కోపిక్ విధానం ఎత్తివేయడం వల్ల ఒక యూనిట్ అదనంగా వాడితే ఏకంగా రూ.307.05 అదనపు భారం పడనుంది. అదెలాగంటే... ప్రస్తుత చార్జీల విధానంలో 101 వాడితే మొదటి 100 యూనిట్లకు రూ.2.60 చొప్పున రూ.260, అదనపు ఒక యూనిట్‌కు రూ.3.60 కలుపుకుంటే మొత్తం రూ.263.60 అవుతుంది. అదే నాన్-టెలిస్కోపిక్ విధానం వల్ల 101 యూనిట్లకు యూనిట్‌కు రూ.5.65 చొప్పున రూ.570.65 అవుతుంది. అంటే ఆ ‘ఒక’ యూనిట్ వల్ల అదనంగా రూ.307.05 చెల్లించాల్సి వస్తుందన్నమాట.
గృహాలకు భారీ షాక్...!
గృహ వినియోగదారులకు విద్యుత్ చార్జీల షాక్ భారీగా తగలనుంది. ఇందుకు కారణం ప్రస్తుతం అమలవుతున్న టెలిస్కోపిక్ విధానాన్ని తాజాగా ఎత్తివేయడమే. చార్జీల పెంపు ద్వారా ఒక్క గృహ వినియోగదారుల నుంచే ఏకంగా రూ.3,606 కోట్ల ఆదాయాన్ని కూడగట్టుకునేందుకు టెలిస్కోపిక్ విధానం ఎత్తివేశారు. టెలిస్కోపిక్ విధానం అంటే.... ఒక వ్యక్తి నెలకు 220 యూనిట్ల కరెంటును వినియోగిస్తే... మొదటి 100 యూనిట్లకు యూనిట్‌కు రూ.2.60 (0-100 స్లాబు రేటు) చొప్పున, 101-200 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.3.60 చొప్పున, మిగిలిన 20 యూనిట్లకు యూనిట్‌కు రూ.6.15 చొప్పున వసూలు చేస్తున్నారు. తాజాగా నాన్-టెలిస్కోపిక్ విధానం అమల్లోకి రానుంది. దీనివల్ల చార్జీల మోత మోగిపోతుంది. నెలకు 220 యూనిట్లను వినియోగిస్తే... ఈ విధానంలో మొత్తం 220 యూనిట్లకూ.. యూనిట్‌కు రూ.6.15 చొప్పున వసూలు చేస్తారు.
పంచాయతీల్లో చీకట్లే!
ఇప్పటికే కరెంటు బిల్లులు చెల్లించలేక అనేక పంచాయతీల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. ఇక మీదట ఈ చీకట్లు శాశ్వతం కానున్నాయి. తాగునీటికీ ఇక్కట్లు తప్పేలా లేవు. పంచాయతీల్లో వీధి దీపాలు, తాగునీటి సరఫరాకు ఒకే చార్జీల విధానం అమల్లోకి రానుంది. ప్రస్తుతం మైనర్ పంచాయతీల్లో వీధిదీపాలకు యూనిట్‌కు రూ. 2.37, మేజర్ పంచాయతీలల్లో యూనిట్‌కు రూ. 3 చొప్పున వసూలు చేస్తున్నారు. తాగునీటి సరఫరాకు రూ.1.45 నుంచి రూ.1.95 వరకూ వసూలు చేస్తున్నారు. ఇక మీదట అన్ని పంచాయతీల్లో ఒకే చార్జీల విధానం అమలు కానుంది. యూనిట్‌కు ఏకంగా రూ. 5.24 చొప్పున వసూలు చేయనున్నారు. నగరపాలక సంస్థలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో కూడా వేర్వేరు విద్యుత్ చార్జీల విధానం అమల్లో ఉంది. అయితే, తాజాగా అన్ని నగరపాలక సంస్థలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లల్లో వీధి దీపాలు, తాగునీటి సరఫరా పథకాలకు సరఫరా చేసే విద్యుత్ చార్జీలను యూనిట్‌కు రూ. 5.74 చొప్పున వసూలు చేయనున్నారు. వీటితో పాటు పంచాయతీల్లో డిమాండ్ చార్జీలు కిలోవాట్ హవర్స్ (కేవీహెచ్)కు రూ.10 ఉండగా... తాజాగా రూ.30కి పెంచారు. విద్యుత్ చార్జీల పెంపు ద్వారా స్థానిక సంస్థలపై ఏకంగా రూ.595 కోట్ల భారం పడనుంది.
పరోక్ష వడ్డన ఇలా..!
అసలు చార్జీలతో పాటు పరోక్షంగా డిమాండ్, ఫిక్స్‌డ్ చార్జీలను కూడా తాజాగా పెంచారు. అవి ఇలా ఉన్నాయి...
ఎల్‌టీ కేటగిరీలోని వాణిజ్య సంస్థలకు ప్రస్తుతం ఫిక్స్‌డ్ చార్జీలు కేవీఏకు రూ.15 ఉండగా తాజాగా రూ. 50కు పెంచారు.
చిన్నతరహా పరిశ్రమలకు ఫిక్స్‌డ్ చార్జీలను కేవీఏకు రూ.50 నుంచి రూ.100కు పెంచారు.
కాటేజీ పరిశ్రమలకు రూ.10 నుంచి రూ. 20కు పెంచారు. చెరకు క్రషింగ్, చేపలు, రొయ్యల పెంపకానికి ఫిక్స్‌డ్ చార్జీలు ప్రస్తుతం లేవు. వీటికి కూడా కేవీఏకు ఇక మీదట రూ.20 వసూలు చేయనున్నారు.
పంచాయతీలకు ప్రస్తుతం రూ.10 ఉన్న ఫిక్స్‌డ్ చార్జీలను రూ.20కు, నగరపాలక సంస్థలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు రూ.20లను కాస్తా రూ. 30లకు పెంచారు.
భారీ పరిశ్రమలు, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌లు, టౌన్‌షిప్‌లు, నివాస కాలనీలకు కేవీఏకు రూ.250 ఉన్న ఫిక్స్‌డ్ చార్జీలను రూ.400కు పెంచగా, ఫిక్స్‌డ్ చార్జీలు లేని ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు కూడా కేవీఏకు రూ.400 చొప్పున వసూలు చేయాలని డిస్కంలు ప్రతిపాదించాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి