చూడని వాళ్లే జీనియస్ (రివ్యూ)
 
 
 జీనియస్ నటీనటులు: హవీష్, సానూషా, అశ్విన్‌ బాబు, శరత్‌కుమార్, సుమన్ తదితరులు సంగీతం: జోష్వా శ్రీధర్, కథ: చిన్నికృష్ణ, ఛాయాగ్రహణం: దివాకరన్ ఎడిటింగ్: ఎం ఆర్ వర్మ మాటలు: పరుచూరి బ్రదర్స్, నిర్మాత: దాసరి కిరణ్‌ కుమార్, దర్శకత్వం: ఓంకార్. విడుదల తేదీ: 2012-12-28 ప్రముఖ టీవీ యాంకర్ ఓంకార్ అన్నయ్య మెగాఫోన్ పట్టుకుని సినిమా డైరక్షన్ చేస్తున్నాడనగానే అందరిలోనూ ఆసక్తి. దానికి తోడు కోటి రూపాయల రచయిత అనిపించుకున్న చిన్ని కృష్ణ కథ ఇవ్వటం జరిగింది. చిన్ని కృష్ణ... తన గత చిత్రాల్లాగే సంచలన విజయం సాధించేలా 'జీనియస్' కథను రూపొందించడం జరిగిందని, ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేని అన్నాహజారే సొంతవూరు 'రాలేగావ్ సిపీ"లో కూర్చొని రాయడం జరిగిందని ఇంకాస్త బిల్డప్ ఇచ్చి మరీ ఈ సినిమాను లాంచ్ చేసారు. అయితే అంత సీన్ తెరపై కనపడలేదు. వ్యక్తి పూజ వద్దు అనే అంశంతో రూపొందిన ఈ కథలో శ్రీనివాస్( హవీష్), యాసిర్(అశ్విన్ బాబు), శివ(వినోద్) ముగ్గురూ చిన్నతనం నుంచీ మంచి ప్రెండ్స్. ముగ్గురూ తమ ఇష్టమైన రంగాల్లో(క్రికెట్, సినిమా, పొలిటిక్స్) ముగ్గురు వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని రాణించాలని ప్రయత్నిస్తారు. అయితే తాము ఎంతగానో నమ్మిన ఆ వ్యక్తులు మోసం చేయటంతో రగిలిపోతారు. తమలాగే ఇలాంటి వ్యక్తులను ఆరాధిస్తున్నవారిని మేల్కొపాలని, తమను మోసం చేసిన వ్యక్తులకు బుద్ది చెప్పాలని నిర్ణయించుకుంటారు. ఆ క్రమంలో వారేం చేసారు.. ఏం సాధించారు.. ఏం కోల్పోయారు అనేది మిగతా కథ. పాయింట్ గా నేటి సమాజంలో చాలా మంది ఎదుర్కొంటున్నదే అయినా దాన్ని డీల్ చేసే విధానంలో తడబడ్డారు. ఏ విధమైన ఇంపాక్టూ ఇవ్వలేక పోయారు. దానికి తోడు నువ్విలాతో పరిచయమైన హవీష్ ఈ రెండో చిత్రంలోనూ తన నటనను మెరుగుపరుచుకోలేకపోయారు. దాంతో అతని శక్తికి మించిన పాత్రగా మారింది. ఒకే ఎక్సప్రెషన్ తో సినిమా మొత్తం లాగించేద్దామని ప్రయత్నం చేసాడు. ఇక హవీష్ ప్రేమించే అమ్మాయిగా చేసిన సుషన అయితే అస్సలు నప్పలేదు... సినిమా వారి భాషలో చెప్పాలంటే హీరోయిన్ మెటీరియల్ కాదు. సీనియర్ నటులు ఆశిష్ విద్యార్ది, ప్రదీప్ రావత్, కోట శ్రీనివాస రావు కొత్తగా చేయకపోయినా వారే ఈ సినిమాకు మూల స్ధంబాల్లా నిలబడ్డారు. ఎంతో బిల్డప్ చేసిన డిబ్బరి డిబ్బరి ఐటం సాంగ్ అనుకున్నంతగా పేలలేదు. ఈ పాట వచ్చేటప్పటికే జనాల్లో సహనం నసించిపోవటంతో పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. అలాగే నాగబాబు, అన్నపూర్ణ,కె.విశ్వనాధ్ వంటి ఆర్టిస్టులు ఉన్నా వారిని సరిగ్గా వినియోగించుకోలేకపోయారు. భారతదేశం, పాక్ ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ నేపధ్యంలో దేశాన్ని మోసం చేసిన క్రికెటర్ ని అంతం చేసే సీన్స్ టప్పట్లు కొట్టించుకున్నాయి. అలాగే కోట,అశీష్ విద్యార్ధి మధ్య వచ్చే సన్నివేశం, హీరోలను వెర్రిగా అభిమానించేవారి కళ్ళు తెరిపించే సన్నివేశం వంటివి సినిమాలో అక్కడక్కడా మెరిసాయి. కెమెరా జస్ట్ ఓకే. ఎడిటింగ్ ఇంకా బాగా చేయవచ్చని సినిమా లో బోర్ సీన్స్ వచ్చినప్పుడల్లా అనిపిస్తుంది. ప్లస్ పాయింట్స్ లో శరత్ కుమార్ తన ఫవర్ ఫుల్ నటనతో ఉన్నంతసేపు సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసాడు. బ్రహ్మాందం కామెడీ ఓకే. గబ్బర్ సింగ్ స్ఫూఫ్ బాగా పేలింది. పరుచూరి బ్రదర్శ్ డైలాగుల్లో సినిమా సినిమాకీ వాడి తగ్గిపోతోంది. ఆ విషయం ఈ సినిమాతో మరీ స్పష్టమైంది. విగ్రహాలు పెట్టుకున్నంత వాళ్లంతా మహాత్ములు కాదు, డైలాగ్ మార్చాలా... డైరక్టర్ ని మార్చాలా వంటివి మాత్రం బాగున్నాయి. సంగీతం కూడా ఈ సినిమాకు పెద్ద మైనస్ గా మారింది. దర్శకుడుగా ఓంకార్ మాత్రం కొత్త దర్శకుడు అని మాత్రం ఎక్కడా అనిపించకుండా మ్యానేజ్ చేసి నడిపించారు. రెగ్యులర్ కమర్షియల్ కథను ఎంచుకుంటే బాగానే మెప్పించగలడని అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. కేవలం ఓంకార్ అభిమానులకు మాత్రమే నచ్చే ఈ సినిమాలో ఎమోషనల్ ఇంటెన్సిటీ కొరవడటంతో ఎంతో మెసేజ్ ఉన్నా... కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా పేలని బాంబులా మిగిలిపోయింది.
 

కొత్తగానే ఉంది కానీ...
 
 -సూర్య ప్రకాష్ జోశ్యుల తను హీరోగా ఉన్నాడంటే... రెగ్యులర్ సినిమాల్లా కాకుండా ఏదో ఒక విభిన్నత ఉంటుందని ప్రేక్షకులు ఆశించేలా తనదైన శైలిలో కథలు ఎన్నుకుంటూ శర్వానంద్ ముందుకెళ్తున్నాడు. అదే ఒరవడి కంటిన్యూ చేస్తూ ఈ సారి తనే నిర్మాతగా మారి తెలుగులో అరుదైపోయిన... హీస్ట్ (Heist)జనర్ లో ఓ చిత్రం చేసాడు. అయితే చాలా సినిమాల్లాగానే ఫస్టాఫ్ బాగుండి.. సెకండాఫ్ లెక్కకుమించిన ట్విస్ట్ లతో, డబుల్ క్రాసింగ్ లతో థ్రిల్లర్ చూస్తున్న అనుభూతిని చంపేసింది. కానీ సినిమా ఫలితం ఎలా ఉన్నా దర్శకుడు కష్టం మాత్రం ప్రతి ఫ్రేమ్ లోనూ కనపడుతుంది. ఆవకాయ బిర్యానీతో పరిచయమైన అనీష్ కురువిల్లా ఈ చిత్రంలో లవ్ స్టోరీని మాత్రం చాలా బాగా తీసి పండించాడు. అదొక్కటే పూర్తి సినిమాగా ఉన్నా బావుండేది అనిపించింది. బ్యానర్: శర్వా ఆర్ట్స్ నటీనటులు: శర్వానంద్, శ్రీహరి, ప్రియా ఆనంద్, త్రాగుబోతు రమేష్, పృధ్వీ, వినయ్ వర్మ, ప్రభాకర్ తదితరులు. ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్ సంగీతం: శక్తికాంత్ కార్తీక్, ఛాయాగ్రహణం: ఎరుకుళ్ళ రాకేష్, నవీన్ యాదవ్ నిర్మాత: మైనేని వసుంధరాదేవి, దర్శకత్వం: అనీష్ యోహాన్ కురువిల్లా. విడుదల తేదీ: డిసెంబర్ 28, 2012 sharwanand ko ante koti review కో అంటే కోటి | శర్వానంద్ | ప్రియా ఆనంద్ జీవన ప్రస్దానంలో దొంగగా మారిన వంశీ(శర్వానంద్) అనే అనాధ కథ ఇది. జైలుకు వెళ్లి వెళ్లి విసుగు వచ్చిన వంశీ... పేరు, ఊరు మార్చుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నా అతని గతం అతన్ని ప్రశాంతంగా బ్రతకనివ్వకుండా ఏదో ఒక సవాల్ విసురుతూనే ఉంటుంది. అలా ఓ రోజు మాయా మాస్టర్ (శ్రీహరి)అనే ఓ సీనియర్ దొంగ అతని జీవితంలోకి ప్రవేశిస్తాడు. మాయా మాస్టర్ ఓ పెద్ద దొంగతనానికి ప్లాన్ చేస్తాడు. ఎంత ఎత్తైన ఎత్తులు అయినా ఎక్కగలిగే నైపుణ్యం ఉన్న వంశీని తన టీమ్ లోకి తీసుకోవాలనుకుంటాడు. అయితే మళ్లీ దొంగగా మారటం మొదట ఒప్పుకోని వంశీ... తర్వాత మాయా మాస్టర్...పోలీసులుకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని బెదిరించటంతో ఓకే అంటాడు. మరో ప్రక్క వంశీ కి పర్శనల్ లైఫ్ లో సత్య(ప్రియా ఆనంద్)తో లవ్ స్టోరీ ఉంటుంది. ఆమెకు తను దొంగ అని తెలియటంతో బ్రేక్ అప్ అయ్యి ఉంటాడు. తిరిగి ఆమెను ఎలా కలుసుకున్నాడు. ఆ దొంగతనం ఎలా జరిగింది....అంతా సవ్యంగానే జరిగిందా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. నాకెవరూ చెప్పలేదు..బతుడం ఎలానో..! బతికే దారే లేనప్పుడే.. మంచో.. చెడో..ఎలానో బతికేయడమే కావాలి.. వంటి డైలాగుతో హీరో పాత్రను పరిచయం చేస్తూ కథకు డెప్త్ తీసుకువచ్చే ప్రయత్నం చేసిన దర్శకుడు,ఫస్టాఫ్ బాగా చేసినా సెకండాఫ్ కి వచ్చేసరికి తడబడిపోయాడు. నిజానికి... హీస్ట్ సినిమాలను చూసే ప్రేక్షకుడు దృష్టి .. కథలో ప్రధాన పాత్రలు దొంగతనం ఎలా చేస్తారు...జరిగేటప్పుడు ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి...ఎలా తప్పించుకున్నారు వంటి విషయాలపైనే ఉంటుంది. అలాంటిది ఈ సినిమాలో దొంగతనం ఎపిసోడ్ చాలా చిన్నది చేసేసారు. అక్కడ ఉత్కంఠత కలిగించలేకపోయారు. అలాగే సెకండాఫ్ ప్రారంభమైన కొద్ది సేపటికే..కథలో కీలకమైన రెండు పాత్రలను చంపేయటంతో కథ ఒక్కసారిగా సీరియస్ మోడ్ లోకి వెళ్లి డ్రాప్ అవటం మొదలైంది. పోనీ ఆ సీరియస్ నెస్ ని అయినా కంటిన్యూ చేసారా అంటే...దాన్ని వదిలేసి... హీరో ప్లాష్ బ్యాక్ లోకి వెళ్లి లవ్ స్టోరీతో కనెక్టు చేయటం మొదలెట్టారు. కథలో ప్రధాన పాత్రలు మంచి టెన్షన్ గా ఉన్న సమంయంలో వేరే ట్రాక్ లోకి వెళితే ఆ ట్రాక్ ఎంత గొప్పగా ఉన్నా...టెన్షన్ ఎలిమెంట్ మీదే చూసేవారి దృష్టి ఉంటుంది. అది మర్చిపోయినట్లున్నారు. దానికి తోడు ప్లాష్ బ్లాక్ లో ప్లాష్ బ్యాక్ లు చూపి...కన్ఫూజ్ అయ్యి..చూసే వారిని కన్ఫూజ్ చేసేసారు. ఒకానొక టైమ్ లో కథ ప్లాష్ బ్యాక్ లో జరుగుతోందా...ఆఫ్టర్ ప్లాష్ బ్యాక్ జరుగుతోందా అర్దం కాకుండా పోయింది. అలాగే ఫలానా వాడు మెయిన్ విలన్ అని చెప్పకుండా నలుగురైదుగురు విలన్స్ ని చూపటంతో అసలు ఎవరు విలనో...కొసరు విలన్ ఎవరో అర్దం కాదు. రెగ్యులర్ కథ కాదు కాబట్టి స్క్రిప్టు పై మరింత శ్రద్ద పెడితే బాగుండేది. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ దర్శకుడు మంచి లవ్ స్టోరీ తీస్తే మాత్రం సూపర్ గా ఉంటుందని, లవ్ ఎపిసోడ్ చూడగానే అనిపిస్తుంది. అలాగే శర్వానంద్ కూడా చాలా బాలన్సెడ్ గా చేసాడు. ఇక శ్రీహరి అయితే చాలా బాగా చేసాడు..లేదు దర్శకుడు అంత బాగా చేయించుకున్నాడు. కెమెరా వర్క్ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఎడిటింగ్ .. ప్రేక్షకుడుకి కన్పూజన్ లేకుండా జాగ్రత్తలు తీసుకుని ప్లాష్ బ్యాక్స్ అమరిస్తే బాగుండేది. సంగీతంలో రెండు పాటలు బాగున్నాయి. ప్రియా ఆనంద్ క్యూట్ గా ఉంది.. గజనీలో అసిన్ ని గుర్తు చేసింది. ఆమె తన డ్రామా ట్రూప్ తో చేసే కామెడీ సీన్స్ కూడా బాగా పండాయి. డైలాగులు కూడా న్యాచురల్ గా బాగున్నాయి. హీరోతో పాటు దొంగతనం టీమ్ లో చేసే మరో ఇద్దరు (కొత్తవాళ్లు) బాగా చేసారు. తాగుబోతు రమేష్ ఉన్నది కొద్ది సేపే కానీ బానే నవ్వించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. శర్వానంద్ ఇదే బ్యానర్ పై ఇలాంటి కొత్త తరహా చిత్రాలు మరిన్ని చేస్తే బాగుంటుంది. ఫైనల్ గా కొత్త గా ట్రై చేసిన ఈ చిత్రం హీరో,హీరోయిన్ లవ్ సీన్స్ కోసం చూడొచ్చు. అంతేగాని Heist సినిమా చూడబోతున్నాం అని ఫిక్సై వెళితే అనుకున్నంత థ్రిల్లింగ్ దొరక్క నిరాసకలుగుతుంది. ఇవన్నీ ఎలా ఉన్నా..ఏదో కొత్తగా ప్రయత్నించాలనే తాపత్రయంతో సొంత డబ్బు పెట్టి మరీ సినిమా తీసిన శర్వానంద్ ని మాత్రం అభినందిచాలి. (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది) Happy 95 Sad 45 Confused 5 Funny 5 Angry 65 Topics: sharwanand, siddharth, శర్వానంద్, ఆవకాయ బిర్యాని, సిద్దార్ద Story first published: Friday, December 28, 2012, 15:56 [IST] English summary Sharwanand and Priya Anand -starrer Ko ante Koti is releasing today (December 28) with divide talk. This hero is doing his first ever action and commercial entertainer 'Ko ante Koti' directed by Anish Yohan Kuruvilla and produced by Maineni Vasundhara Devi on the banner of Sarva Arts. Share This Story 1 Related Articles రామ్ గోపాల్ వర్మ చిత్రంలో శర్వానంద్ రామ్ గోపాల్ వర్మ చిత్రంలో శర్వానంద్ యాక్షన్ థ్రిల్లర్ ( 'కో అంటే కోటి' ప్రివ్యూ ) యాక్షన్ థ్రిల్లర్ ( 'కో అంటే కోటి' ప్రివ్యూ ) శర్వానంద్ ‘కో అంటే కోటి’ సెన్సార్ రిపోర్ట్ శర్వానంద్ ‘కో అంటే కోటి’ సెన్సార్ రిపోర్ట్ Cinema Buzz: ఈ వీకెండ్ సినిమా రిలీజ్ విశేషాలు Cinema Buzz: ఈ వీకెండ్ సినిమా రిలీజ్ విశేషాలు December 28, 2012 లో ప్రచురితమైన అన్ని ఆర్టికల్స్ చదవండి మీ వ్యాఖ్య రాయండి Press Ctrl+g to toggle between English and Telugu Your name: l

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి