‘నిర్భయ’ పేరు జ్యోతిసింగ్ పాండే

‘నిర్భయ’ పేరు జ్యోతిసింగ్ పాండే
బ్రిటన్ పత్రిక ఇంటర్వ్యూలో ఢిల్లీ గ్యాంగ్‌రేప్ మృతురాలి తండ్రి వెల్లడి
1/7/2013 12:17:00 AM
లండన్: ‘‘నా కుమార్తె ఎలాంటి తప్పూ చేయలేదు. ఆమె నిజమైన పేరు ప్రపంచానికి తెలియాలని మేం కోరుకుంటున్నాం. ఆమె తనను తాను రక్షించుకునే క్రమంలో చనిపోయింది. ఆమె పట్ల నేను గర్విస్తున్నా. ఆమె పేరును వెల్లడించటం వల్ల.. ఇలాంటి దాడులకు గురైన ఇతర మహిళలకు ధైర్యం లభిస్తుంది. నా కుమార్తె నుంచి వాళ్లు బలం పొందుతారు’’ అంటూ.. ఢిల్లీ అత్యాచార బాధితురాలి తండ్రి బద్రీసింగ్‌పాండే తన కుమార్తె పేరును వెల్లడించారు.

తాము చేసిన ఇంటర్వ్యూలో బద్రీ తన కుమార్తె పేరును వెల్లడించారని లండన్‌కు చెందిన ద డైలీ మిర్రర్ ఆదివారం సంచిక ‘ద సండే పీపుల్’ తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లోని వారి పూర్వీకుల స్వస్థలం బలియాలో బద్రీని ఇంటర్వ్యూ చేసినట్లు పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో కామాంధుల దాష్టీకానికి బలైన తమ కుమార్తె మరణం తాలూకు భయంకర జ్ఞాపకాల నుంచి కొంత కాలం దూరంగా ఉండేందుకు బద్రీ కుటుంబం వారి స్వస్థలానికి వెళ్లింది. ఆమె ఉదంతం యావత్తు భారతదేశాన్నీ అట్టుడికించటమే కాదు.. మహిళా భద్రతపై యువత, ప్రత్యేకించి మహిళాలోకం దేశవ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపట్టటానికి ప్రేరణనిచ్చింది. భారతీయ చట్టాల ప్రకారం అత్యాచార, లైంగిక వేధింపుల బాధితుల పేర్లను, బాధితుల అనుమతి లేకుండా, బాధితులు చనిపోయిన పక్షంలో వారి కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా బహిర్గతం చేయటానికి వీలులేదు.

దీంతో.. ఆమెను ఇప్పటివరకూ ఆమె ప్రదర్శించిన ధైర్యసాహసాలకు మారుపేరుగా నిర్భయ, దామిని వంటి మారు పేర్లతో పిలుచుకుంటున్నారు. అయితే.. ఆమె మరణించిన వారం రోజుల తర్వాత ఆదివారం ఆమె తండ్రి బద్రీసింగ్‌పాండే (53) బ్రిటిష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కుమార్తె పేరు జ్యోతిసింగ్‌పాండే అని స్వయంగా వెల్లడించారు. తన కుమార్తె ఎలాంటి తప్పూ చేయలేదని, ఆమె పేరు ప్రపంచానికి తెలియాలని ఆయన పేర్కొన్నారు. బాధితురాలి తల్లి ఆషా (46) ఇంకా నిశ్చేష్టంగానే ఉన్నారు. ‘నేను మొదట ఈ రాక్షసత్వానికి పాల్పడిన వారిని ముఖాముఖి చూడాలనుకున్నా. కానీ ఇప్పుడు అలా అనుకోవటం లేదు. కోర్టులు వారిని శిక్షించాయని, వారిని ఉరి తీస్తారని చెప్తే వినాలని మాత్రమే కోరుకుంటున్నా. ఆరుగురికీ మరణశిక్ష విధించాలి. ఈ మగాళ్లు పశువులు. ఇలాంటి ఘటనలు జరగటాన్ని సమాజం అంగీకరించదనేందుకు వీరిని ఉదాహరణగా చేయాలి’ అని బద్రీ పేర్కొన్నారు. ‘ద సండే పీపుల్’ చేసిన ఇంటర్వ్యూలో బద్రీసింగ్‌పాండే వివరించిన ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...

అత్యాచారం గురించి వారికి చెప్పలేకపోయా...

‘‘ఆ రోజు నేను ఢిల్లీ విమానాశ్రయంలో (అక్కడ లోడర్‌గా పనిచేస్తున్నారు) పని ముగించుకుని రాత్రి 10:30 గంటల తర్వాత ఇంటికి చేరుకున్నా. జ్యోతి సినిమాకు వెళ్లి ఇంకా తిరిగి రాలేదని నా భార్య ఆందోళనగా చెప్పింది. మేం ఆమె మొబైల్ ఫోన్‌కు, ఆమె స్నేహితుడి మొబైల్ ఫోన్‌కు ఫోన్లు చేయటం మొదలుపెట్టాం. కానీ సమాధానం లేదు. రాత్రి 11:15 గంటలకు ఢిల్లీలోని ఒక ఆస్పత్రి నుంచి మాకు ఫోన్ వచ్చింది. మా కుమార్తెకు ప్రమాదం జరిగిందని చెప్పారు. నేను ఒక స్నేహితుడితో కలిసి అతడి మోటార్‌సైకిల్ మీద ఆస్పత్రికి వెళ్లాను. మొదట చూసినప్పుడు నా కుమార్తె ఆస్పత్రి బెడ్ మీద కళ్లుమూసుకుని ఉంది. నేను ఆమె తలపై చేయిపెట్టి పేరుతో పిలిచా. ఆమె నెమ్మదిగా కళ్లు తెరిచి ఏడవటం ప్రారంభించింది. చాలా నొప్పిగా ఉందని చెప్పింది. నేను కన్నీళ్లు ఆపుకున్నా. ఆందోళనపడొద్దు.. ధైర్యంగా ఉండు.. అంతా సర్దుకుంటుంది.. అని చెప్పా. అప్పటికి.. జరిగిన దారుణం గురించి నాకు ఇంకా తెలియదు. చివరికి ఒక పోలీస్ అధికారి ఏం జరిగిందో చెప్పాడు. నేను వెంటనే నా భార్య, కుమారులకు ఫోన్ చేసి ఆస్పత్రికి రమ్మని చెప్పా. కానీ.. అత్యాచారం గురించి వారికి చెప్పలేకపోయా.

మరెవరికీ ఎన్నడూ జరగకూడదని కోరుకుంటున్నా...

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జ్యోతి 10 రోజుల పాటు స్పృహలోకి వస్తూ, పోతూ ఉంది. ఆమె కోలుకుంటుందన్న ఆశ ఉండేది. నా కుమార్తెను కాపాడటానికి డాక్టర్లు శక్తిమేరకు ప్రయత్నించారు. ఆమె ఎక్కువగా సంజ్ఞలతోనే మాట్లాడింది. నోట్లో ఆహారం అందించేందుకు పైపు ఉండటంతో మాట్లాడలేకపోయింది. తనకు బతకాలని ఉందని, కోలుకోవాలని ఉందని, మాతో కలిసి జీవించాలని ఉందని ఆమె ఒక కాగితంపై కూడా రాసి చూపింది. కానీ చివరికి విధే గెలిచింది. జ్యోతి పోలీసులకు రెండుసార్లు వాంగ్మూలం ఇచ్చింది. అప్పుడు నా భార్య కుమార్తెతోనే ఉంది. అదంతా విన్న తర్వాత ఆమె ఏడ్చింది. ఏం జరిగిందో తర్వాత నాకు చెప్పింది. దానిని వివరించటానికి నా దగ్గర మాటలు లేవు. నేను చెప్పగలిగిందల్లా.. వాళ్లు మనుషులు కాదు.. కనీసం జంతువులు కూడా కాదు. వాళ్లు ఈ ప్రపంచానికి చెందిన వాళ్లు కాదు. అది చాలా కిరాతకం. నా కుమార్తెకు జరిగింది మరెవరికీ ఎన్నడూ జరగకూడదని కోరుకుంటున్నా.

ఆమె లేని మా బతుకులు శూన్యం: నా కుమార్తె చాలా ఏడ్చింది. చాలా తీవ్రమైన బాధకు, నొప్పికి గురయింది. అమ్మను, తమ్ముళ్లను చూసినప్పుడు మళ్లీ ఏడ్చింది. కానీ.. ఆ తర్వాత ఆమె చాలా ధైర్యంగా ఉంది. మమ్మల్ని కూడా ఓదార్చటానికి ప్రయత్నించింది. అంతా మంచి జరుగుతుందన్న ఆశ కల్పించటానికి ప్రయత్నించింది. జ్యోతి కడుపులో పేగులను వైద్యులు తొలగించాల్సి వచ్చింది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించటంతో ప్రత్యేక చికిత్స కోసం విమానంలో సింగపూర్‌కు తరలించారు. అంతా మామూలవుతుందని, త్వరలో తిరిగి ఇంటికి వస్తామని నేను నా కుమార్తెతో చెప్పా. ఇంటికి వెళ్తామన్న మాట ఆమెకు సంతోషం కలిగించింది. నవ్వింది. నేను ఆమె నుదుటిపై చేయిపెట్టా. నేను రాత్రిపూట భోజనం చేశానా లేదా అని అడిగింది. నన్ను వెళ్లి పడుకోమని సైగ చేసింది. నేను ఆమె చేయిపట్టుకుని ముద్దుపెట్టా. విశ్రాంతి తీసుకోమని చెప్పా. ఆమె కళ్లు మూసుకుంది. ఆ దాడి జ్ఞాపకాలతో, ఆ దాడి మిగిల్చిన వేదనతోనే జీవించాల్సి ఉన్నా కూడా.. నా కుమార్తె బతకాలని నేను ఎంతగానో కోరుకున్నా. ఆమె చనిపోవటంతో మేం కుంగిపోయాం. మా ప్రపంచానికి ఆమే కేంద్ర బిందువు. ఆమె చుట్టూనే మా జీవితాలు తిరిగేవి. ఆమె లేకపోవటం ఎంతో బాధ కలిగిస్తోంది. ఆమె లేని భవిష్యత్తును ఊహించలేకపోతున్నాం.’’

మహిళలను గౌరవించడాన్ని కొడుకులకు తల్లిదండ్రులు నేర్పాలి

‘‘భారత ప్రజలు స్పందించిన తీరు మమ్మల్ని కదిలించింది. వాళ్లు మాకు మనోధైర్యాన్నిచ్చారు. ఈ దారుణాన్ని తట్టుకోగల శక్తినిచ్చారు. జ్యోతి నా కుమార్తె మాత్రమే కాదు.. భారతదేశ కుమార్తె అని నేను భావిస్తున్నా. అత్యాచార ఘటనల గురించి పత్రికల్లో చదివేవాడిని. చదివి తట్టుకోలేకపోయేవాడిని. ఈ క్రూరత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన ప్రజలందరికీ మేం రుణపడి ఉంటాం. మహిళలను గౌరవించాలని తల్లిదండ్రులు తమ కుమారులకు నేర్పుతారని నేను ఆశిస్తున్నా. దీనిని పోలీసులు తమంత తాముగా నియంత్రించలేరు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల నడవడికను గమనిస్తూ ఉండాలి.’’

మా జీవితాలను మార్చేస్తానంది...

‘‘జ్యోతి స్నేహితుడు అవీంద్ర ఆమె ప్రేమికుడు కాదు. ఆమెను కాపాడటానికి ప్రయత్నించిన ఒక ధైర్యవంతుడైన స్నేహితుడు మాత్రమే. మేం వేర్వేరు కులాలకు చెందిన వాళ్లం. అతడితో ఆమెకు పెళ్లి అన్న ప్రశ్నే రాదు. అవీంద్ర తనను రక్షించటానికి ఎంతగా ప్రయత్నించాడో జ్యోతి పలుమార్లు మాకు చెప్పింది. అతడు తన శక్తిమేరకు ప్రయత్నించాడని, కానీ వాళ్లు అతడిని రాడ్‌తో కొడుతూ ఉన్నారని ఆమె తన తల్లికి చెప్పింది. పెళ్లి చేసుకోవాలన్న కోరిక జ్యోతి ఎన్నడూ వ్యక్తం చేయలేదు. ఆమె తన చదువు మీద దృష్టిపెట్టింది. ముందు మంచి ఉద్యోగం కావాలనుకుంది. డాక్టర్ కావాలన్నది ఆమె కల. అలాంటి కోర్సులు చదవటానికి ఫీజులు కట్టే స్తోమత నాకు లేదని నేను ఆమెకు చెప్పా. కానీ జ్యోతికి పట్టుదల ఎక్కువ. డాక్టర్ కావాలని, విదేశాలకు కూడా వెళ్లాలని కోరుకునేది. నా కూతురు చదువు కోసం కొంచెం భూమి అమ్మాను. నా జీతం రూ. 5,700తో ఢిల్లీలో బతకటం కష్టం. ఈ పరిస్థితిని మార్చేస్తానని ఆమె మాకు చెప్పేది. తనకు ఒక ఉద్యోగం వస్తే మా జీవితాలను మార్చాలని తపనపడేది. ఫిజియోథెరపీలో నాలుగేళ్ల కోర్సును పూర్తి చేసింది. దాడికి గురయ్యేటప్పటికి ఇంటర్న్‌షిప్ చేస్తోంది. జ్యోతికి ఇద్దరు తమ్ముళ్లు. గౌరవ్‌సింగ్ (20), సౌరవ్‌సింగ్ (15)’’ అని ఆమె తండ్రి చెప్పారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి